Saturday 16 October 2021

దళితులకు లేని బతుకమ్మ - తెలియని కొన్ని నిజాలు

 దళితులకు లేని బతుకమ్మ - తెలియని కొన్ని నిజాలు

మొన్న గుజరాత్ లో ఇద్దరి దళిత మహిళల్ని బతుకమ్మ ఆడనివ్వని అగ్ర వర్ణాల వారు. ఈ విషయం కాస్త సోషల్‌ మీడియా లో వైరల్‌ అయి తెలిసింది కాని, దీంట్లో ఆశ్చర్యపడాల్సిందేమి లేదు. ఎందుకంటే చారిత్రకంగా దళితులకు బతుకమ్మ ఆడడానికి లేదు.
ఈ విషయమై నా తల్లితండ్రులు, అమ్మమ్మ, నాయనమ్మ, తాత నాతో చెప్పిన విషయాలను మీతో పంచుకుంట
మా అమ్మకు ఊహ తెలిసినప్పటినుండి వారు నివసించే హరిజన వాడ లో బతుకమ్మ ఆడేవారు కాదంట. బతుకమ్మ ఆడకపోవడం కాదు, ఆడటం నిషేధం అన్నది గమనార్హం.
ఇదే మాట, మా అమ్మ వారి అమ్మమ్మ, నాయనమ్మలను అడిగితె, మాదిగోల్లయిన మనకు బతుకమ్మ లేదని, ‘తిండికి లేక చిట్టెడు తౌడు కు పటేన్లకు అమ్ముకున్నమంట’ అని సమాధానం చెప్పేవారంట.
కానీ మా అమ్మకు బతుకమ్మ ఆడాలని కనీసం చూడాలని ఆశతో అగ్రవర్ణాలు బతుకమ్మ ఆడే ప్రదేశానికి వెళ్లి చూసేవారంట. ఎక్కువకులం వారు బతుకమ్మ ఆడి నీళ్లలో వేసి వెళ్లిపోయిన తర్వాత ఆ నీళ్లల్లో మా అమ్మ వారి స్నేహితురాళ్లతో కలిసి చెరువులో దూకి ఆ బతుకమ్మలని బొడ్డుకి, ఆ తరువాత ఇంటికి తెచ్చుకొని ఆడే వారంట. మరుసటి రోజు ఆ పూలనే తోరణాలుగా చేసి ఇంటికి కట్టుకునే వారంట
ఇక హరిజన వాడలో మగవారు ఆ అగ్రకులాల బతుకమ్మ దగ్గరికి డప్పు కొట్టడానికి వెళ్లేవారంట. అయితే డప్పు కొట్టడానికి వెళ్లడం అనేది వారి ఇష్టంతో కాదు, అది అనాదిగా వస్తున్న దురాచారం. వీళ్ళు వెళ్లాల్సిందే డప్పు కొట్టాల్సిందే వారు ఇచ్చే పిండి వంటకాలు tip లాగా ఇస్తే తెచ్చుకోవాలి. ఒక్కోసారి అది కూడా ఉండదు ఎందుకంటే ప్రతి సంవత్సరం అగ్రకులాలు పండించే పంట నుండి దళితులకు దయతలిచి తిండి గింజెలు ఇస్తుండె. వెట్టిచాకిరీ అంటే ఇదే.
మాదిగోళ్ళు డబ్బు కొట్టాలి, ఎర్రమన్ను, పెండ, పటేన్లకు తెచ్చి ఇయ్యాలె
అట్లనే మన్నె మస్కురోల్లు బతుకమ్మ కి కావాల్సిన పువ్వులు తెచ్చి ఇయ్యాలె.
పటేన్లు మాత్రం కడుపుల సల్ల కదలకుండ బతుకమ్మ ఆడుతుంది
అయితే హరిజనవాడ కు బతుకమ్మ లేకపోవడం అంబేద్కర్ నగర్ (మేము ఈ మధ్య పెట్టుకున్న పేరు) అయిన తర్వాత వరకు కొనసాగింది. అంతెందుకు మా పెళ్లిళ్లు అయిన తరువాత కూడా, అంటే 10-12 సంవత్సరాల ముందు వరకు మా ఇంట్లో బతుకమ్మ ఆడి ఆ బతుకమ్మ ని కలపడానికి మా అమ్మ వెళితే అగ్రకులాల వారు ‘మీకు (దళితులకు) బతుకమ్మ ఎక్కడిది’ అని అడుగుతారని, మా అమ్మ మా వదినమ్మ కి బతుకమ్మ ఇచ్చి పంపింది. అయితే ఎవరైనా అడిగితే మా అమ్మ వారికి ఏం సమాధానం చెప్తుండె నో తెలియదు కానీ అడుగుతారేమో అని వెళ్లకపోవడం అనేది ఆ వెలివేత మా అమ్మ మనసులో ఎంతో బలంగా నాటుకు పోయిందో అర్థం చేసుకోవచ్చు
అన్ని పూజలు, వ్రతాలు, సామూహిక సంబరాలు దళితులకు దూరంగా పెట్టినట్టే ఈ బతుకమ్మ నుండి కూడా దళితులను వెలి వేశినారు.